తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి(Sri Venkateshwara swami) సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో బారులు తీరారు.
రిపబ్లిక్ డే, శనివారం, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఎలాంటి టికెట్లు లేకుండా సర్వదర్శనం చేసుకునే భక్తులకు 18గంటల సమయం పడుతోంది.
రూ.300 టికెట్‌తో ప్రత్యేక దర్శనానికి సుమారు 4గంటలు పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.37కోట్లు వచ్చిందని టీటీడీ పేర్కొంది.
శుక్రవారం స్వామివారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారని, 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది. వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.