తిరుమల తిరుపతి(Tirumala Tirupati) దేవస్థానంలోని వెంగమాంబ(Vengamamba) అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యతా లోపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు నిరసన తెలిపారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు.
అన్నప్రసాదం బాగోలేదని భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని టీటీడీ(TTD) సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది భక్తులకు సర్దిచెప్పి పంపించేశారు.
విషయంపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందని, బియ్యంలో నాణ్యత లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అన్నప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు.అదే సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ఆ భక్తులకులేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు ఎదురైందో తెలియడంలేదన్నారు.