తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ అమాంతం తగ్గిపోయింది. ఇవాళ ఆదివారం అయినప్పటికీ రద్దీ పెద్దగా కనిపించడం లేదు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు అధికారులు పేర్కొన్నారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక, సర్వ దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలకు పైగా పడుతోంది.
సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు మాత్రం రద్దీ తక్కువగా ఉండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు సమయం తక్కువగా పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారికి గంటలోపే దర్శనం పూర్తవుతోంది.
కాగా, నిన్న నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ బోర్డు అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 76 వేల 41 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 28వేల 336మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు తెలిపారు.