వేంకటేశ్వర స్వామి భక్తులకు ఐఆర్‌సీటీసీ(IRCTC) శుభవార్త తెలిపింది. తిరుపతికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ‘గోవిందం’(Govindam) పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజులు రెండు రాత్రుల ఈ టూర్‌లో తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు.
డిసెంబర్ 9న ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఈ టూర్ హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లలో కూడా స్టాప్‌లు ఏర్పాటు చేసింది. మొదటి రోజు 12734 నెంబరు గల రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 05:25 గంటలకు బయలుదేరుతుంది. 06:10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ గోవిందం టూర్ ప్యాకేజీలో వివిధ ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రామాణిక తరగతిలో ఒకే ఆక్యుపెన్సీ రూ.4940, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 3800, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3800గా నిర్ణయించబడింది. కంఫర్ట్ క్లాస్ చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6790. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న వారికి ప్రత్యేక ధరలు నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తొలిరోజు సాయంత్రం ప్రయాణం ప్రారంభమై రెండవ రోజు ఉదయం 05:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పికప్ చేసి హోటల్‌కు తీసుకెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అవుతారు. ఉదయం 8 గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌కు చేరుకుని భోజనం ఉంటుంది. ఆ తర్వాత తిరుచానూరు ఆలయ దర్శనం కల్పిస్తారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.25 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు. ఆ తరువాత 3వ రోజు టూర్ నల్గొండకు తెల్లవారుజామున 03:04, సికింద్రాబాద్ స్టేషన్ 05:35, లింగంపల్లి స్టేషన్ 06:55కి చేరుకోవడంతో ఈ పర్యటన ముగుస్తుంది.