బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై తెలంగాణ జన సమితి (Telangana Jana Samithi) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం (Kodanda Ram) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యారంగంపై బీఆర్ఎస్ సర్కార్ దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం ఎక్సైజ్ శాఖపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఒక తరం మొత్తాన్ని తెలంగాణ సర్కార్ నాశనం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యను నియంత్రించే అంశాలను అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…. ఈ పదేండ్ల కాలంలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ముసివేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. గ్రామాల్లో 8, 9 తరగతి చదివే పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారని ఆరోపించారు. మరి కొందరు గంజాయికి బానిస అవుతున్నారని ఆరోపణలు చేశారు. పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన వయసులో బీరు బాటిళ్లు పట్టుకునే పరిస్థితి దాపురించిందన్నారు.
దీన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంత అధ్వానంగా మరిందో తెలుస్తుందన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వ బడుల్లో టీచర్లు కావాలని హైకోర్టుకు విద్యార్థులు లేఖ రాశారని చెప్పారు. అప్పుడు ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయిందన్నారు. దీంతో కొంత మందిని విద్యావాలంటీర్లుగా ప్రభుత్వం నియమించిందన్నారు. అది ఈ తెలంగాణలో ఉన్న పరిస్థితి అని అన్నారు.