TMC : రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ (Derek Obrien) ను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగులుతున్నారని, చైర్మన్ సూచనలను ఖాతరు చేయడంలేదని, సభలో కావాలనే రభస సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి, సభా నేత పీయూష్ గోయెల్ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పలు సందర్భాల్లో డెరెక్ సహనాన్ని కోల్పోయారు.
పాయింట్ ఆఫ్ ఆర్థర్ లేవనెత్తడమే గాక .. జగదీప్ ధన్కర్ పట్ల వేలెత్తి చూపుతూ, మణిపూర్ అంశంపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సీటులో కూర్చోవలసిందిగా చైర్మన్ చేసిన సూచనలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. తన పేరు పెట్టి ధన్కర్ ప్రస్తావించినప్పటికీ..డెరెక్ ఖాతరు చేయకుండా 267 రూల్ కింద తక్షణమే మణిపూర్ (Manipur) పరిస్థితిపై చర్చ చేపట్టాలన్నారు.
దీంతో ఆగ్రహించిన ధన్కర్ .. తన సీటు లోనుంచి లేచి.. మీరు నిన్న కూడా ఇలాగే అనుచితంగా ప్రవర్తించారని, సభా కార్యకలాపాలకు భంగం కలిగించారని అన్నారు. ఈ రోజు కూడా మీరు మీ ప్రవర్తనను మార్చుకోలేదని అంటూ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నానని అన్నారు.
ప్రధానిని, హోమ్ మంత్రిని మీరు ‘వాషింగ్ మెషిన్’ అని ఎద్దేవా చేశారని… ఇలాంటి డ్రామాలు సరికాదని పేర్కొన్నారు. సభ నుంచి తక్షణమే నిష్క్రమించవలసిందిగా ఆదేశిస్తున్నానన్నారు.