ఆదిలాబాద్(Adilabad) నుంచి తిరుపతి(Tirupati) వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్(Krishna Express)కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించిన ఘటన మరువక ముందే ఈ ఘటన కలకలం రేపింది. ఇవాళ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు యాదాద్రి జిల్లా(Yadadri District) ఆలేరు రైల్వే స్టేషన్ దాటుతుండగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందజేశారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రైలును నిలిపివేశారు. ఆ మార్గంలో పట్టాలు విరిగిపోయినట్లు గుర్తించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరుగకముందే అప్రమత్తమై రైలును నిలపడంతో పెద్ద ముప్పు తప్పినట్లైంది. రైల్వే అధికారులు విరిగిపోయిన పట్టాలకు వెంటనే మరమ్మతులు చేయించారు. అనంతరం అక్కడి నుంచి రైలు కొద్ది సేపటి తర్వాత ముందుకు కదిలింది.
శనివారం జరిగిన రైలు ప్రమాదంలో సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్లో పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. బి4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే 2 గంటల పాటు రైలు నిలిపి మరమ్మతులు చేపట్టారు.
కాజీపేట రైల్వేస్టేషన్ లో నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాలేదు. అధికారులకు నిలదీయగా రైలులో పొగలు వ్యాపించాయని తెలుపడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని మరమ్మత్తు చేసినట్లు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. బ్యాటరీ క్యాప్ లీక్ అవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది తెలిపారు. మరమ్మతుల అనంతరం కాజీపేట రైలు బయల్దేరింది. కాగా, వరుసగా రైలు ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.