తెలుగు జాతికి పూర్వ వైభవం తేవాలని టీడీపీ అధినేత(TDP Chief) చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆకాంక్షించారు. ఉగాది రోజుల ప్రజలు ఈ సంకల్పాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నిలబడాలి.. ప్రజలు గెలవాలంటూ ఆకాంక్షించారు. మంగళగిరి(Mangalagiri)లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉగాది(Ugadi) వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలుగు వారికి శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.. దశా, దిశా నిర్దేశం చేసుకోవడానికి ఉగాది పండుగ ఓ వేదిక అని చెప్పారు. తెలుగు వారికి కొత్త ఏడాది ఉగాది నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రకృతికి, పండుగలకు సంబంధం ఉందని, చైత్ర మాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలన్నారు. మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు రావని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం అని ప్రకటించారు. వృద్ధులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన పార్టీనే టీడీపీయే చంద్రబాబు చెప్పుకొచ్చారు.
టీడీపీ హయాంలో ముస్లింలకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదని, పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ ఆశయమని గుర్తుచేశారు. ఆ సంకల్పంతోనే తాను ముందుకెళ్తున్నానని చెప్పారు. పెన్షన్ల పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రూ.14లక్షల అప్పు ఉందన్నారు. వలంటీర్ల వ్యవస్థపై తొలి సంతకం అంటే.. ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థ లేనట్లేగా? అని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని వారికి రూ.10వేలు గౌరవ భృతిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్లు జైలుకు వెళ్లొద్దని, రాష్ట్ర ప్రగతితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జగన్
సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి.. రూ.100 లాగేస్తున్నాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించి పేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో తాను పనిచేశానని గుర్తుచేశారు. రూ.16 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని వెల్లడించారు.