Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
సీఎం కేసీఆర్ (CM KCR) పై టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కొడంగల్‌ను దత్తత తీసుకుని, కృష్ణానది జలాలు తీసుకు వచ్చి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పారని ఆయన అన్నారు. రెండేండ్లలో కొడంగల్ ను సస్యశ్యామలం చేస్తామని తండ్రీ కొడుకులు మాయమాటలు చెప్పారని ఫైర్ అయ్యారు.
కొడంగల్ లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…. తాను తీసుకు వచ్చిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మట్టిలో కలిపారని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి తీసుకు వస్తామని చెప్పి కొడంగల్‌ను ఎడారిగా మార్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దౌల్తాబాద్, బొంరాస్ పేట్ మండలాల్లో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా లేవంటూ విరుచుకుపడ్డారు.
సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలకు ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దత్తత తీసుకున్న కొడంగల్‌కు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన నిలదీశారు. ఒకవేళ కొడంగల్ కు నిధులు ఇస్తే అక్కడ జూనియర్ కాలేజీలు, కృష్ణా జలాలు, కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు రాలేదని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు.
గత పదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసివుంటే రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌లో తనపై పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. కొడంగల్‌లో నువ్వో నేనో తేల్చుకుందామని కేటీఆర్‌కు సవాల్ చేశారు. పేద వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి వుంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చివుంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన వచ్చి కొడంగల్‌లో నామినేషన్ వేయాలన్నారు. తనపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు.








