మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Chief Minister Arvind Kejriwal) సహా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) మరో మంత్రికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం గెహ్లాట్ ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వాంగ్మూలాన్ని తీసుకోవాలని కైలాష్ గెహ్లాట్‌ను కోరినట్లు ఈడీ వెల్లడించింది. అయితే, ఈ పాలసీ రిటైలర్లకు దాదాపు 185శాతం, టోకు వ్యాపారులకు 12 శాతం అధిక లాభాలను అందించిందని ఈడీ ఆరోపిస్తోంది. అదేవిధంగా 600 కోట్లకు పైగా లంచాలుగా ఇచ్చినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఆ డబ్బునంతా గోవా, పంజాబ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను విచారించి 2021-22లో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సెజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలపై మంత్రితో విచారణ చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పేర్కొంది.