రాజకీయాల్లో చాలా మంది నేతలు ఉన్నారు. వారిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ వారంతా రాజకీయాల్లో భాగమయ్యారు. ఇదే విషయాన్ని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) జరగనున్న నేపథ్యంలో.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిర్వహించిన ఏడీఆర్ సర్వేలో కీలక విషయాలు బయటకు వచ్చాయని అంటున్నారు.
రాజకీయాలకు, క్రైమ్‌కు భిన్నమైన సంబంధం ఉందన్న విషయాన్ని.. తాజాగా ఏడీఆర్ నివేదిక ధృవీకరించిందని తెలిపారు. 2004 నుంచి 2019 మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపీ (MP)ల్లో 12 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వారిలో తొమ్మిది మంది ఎంపీలపై మరిన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది.
మరోవైపు ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషణలో 12 మంది ఎంపీలలో తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన ఆరోపణలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడైంది. జాబితాలో చేర్చబడిన 23 మంది ఎంపీలలో 52 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెట్టారని, 39 శాతం మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
వారిలో బీజేపీ (BJP)కి తిరిగి ఎన్నికైన 17 మంది ఎంపీలలో ఏడుగురు, కాంగ్రెస్ (Congress) ఎంపీలు ముగ్గురు, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIAM) నుంచి ఒకరు తిరిగి ఎన్నికైనట్లు ఈ నివేదికలో పేర్కొంది. కాగా శివసేనకు చెందిన ఒక ఎంపీ తనపై ఉన్న క్రిమినల్ కేసులను అఫిడవిట్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా తిరిగి ఎన్నికైన ఎంపీలలో అత్యధికంగా సంపద పెరిగిన వారిలో జె. రమేష్ చందప్ప, మేనకా సంజయ్ గాంధీ, రావ్ ఇంద్రజిత్ సింగ్ వంటి పేర్లు సైతం చేర్చబడ్డాయి.