రాష్ట్రంలో మేడారం జాతర (Medaram Jatara) సందడి షురువైంది.. తెలంగాణ (Telangana) కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే భక్తులు జాతరకు పోటెత్తుతున్నారు. ఈమేరకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. వనదేవతలుగా పూజలందుకొంటున్న సమ్మక్క సారక్క (Sammakka Sarakka)లను దర్శించుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు.
మరోవైపు మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో 6 వేల బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 25 వరకు బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికను సిద్దం చేశారు.
ఈమేరకు ఉమ్మడి ఖమ్మం డిపోల నుంచి 400 ప్రత్యేక బస్సులు.. సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల వరకు 24 బస్సులు, మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేటకు 20 బస్సులు, కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లికి 155 బస్సులు, మదిర డిపో నుంచి పాల్వంచ, ఖమ్మం నుంచి 35 బస్సులు, ఖమ్మం నుంచి 35 బస్సులు. భద్రాచలం నుండి 128 బస్సులు. డిపో నుంచి మేడారం వరకు 38 బస్సులు నడపనున్నారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా మేడారం జాతరకు ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఏయే ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారనే వివరాలను రవాణా శాఖ మంత్రి త్వరలో వెల్లడిస్తారన్నారు. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు..