అయోధ్య (Ayodhya) రామజన్మభూమి వివాదం ముగిసి రామయ్య విగ్రహం ప్రతిష్టాపన జరుపుకోవడానికి సిద్దం అవుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకను తమ ఇంటి వేడుకగా భావిస్తూ.. ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. అయితే సోషల్ మీడియా (Social media)లో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై మిమ్స్ ట్రోల్ అవుతున్నాయి.. రామయ్యకు చక్కని మందిరాన్ని నిర్మించారు.. మరి నాకెప్పుడూ నిర్మిస్తారని కృష్ణయ్యతో ఉన్న మిమ్స్ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh), మథుర (Mathura)లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమిపై ఫోకస్ పెట్టిన హిందూ సంఘాలు ఇప్పటికే కోర్టుమెట్లు ఎక్కారు.. దీంతో ఈ వివాదం కీలక మలుపులు తీసుకొంటూ.. వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికే షాహీ ఈద్గా (Shahi Eidgah) మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం భారత పురావస్తు శాఖ అధికారులు సర్వే చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వేపై నిషేధం విధించింది. అడ్వకేట్ కమీషనర్ సర్వేకు ఆదేశించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలం పక్కనే ఈద్గా మసీదు ఉంది. ఇది ధ్వంసం కాబడిన శ్రీకృష్ణ జన్మస్థలమైన పురాతన ఆలయంపై నిర్మించబడిందనే ఆరోపణలున్నాయి.. ఈ కారణంగా.. హిందూ పక్షం ఒక దరఖాస్తును దాఖలు చేసింది..
మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేసింది. కాశీలోని జ్ఞాన్వాపి మసీదుపై ఇటీవల ఒక సర్వే నిర్వహించబడింది.. దాని నివేదిక కూడా రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు హిందూ పక్షానికి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. మరోవైపు మథురలోని 17 వ శతాబ్దం నాటి షాహి ఈద్గా మసీదును శ్రీకృష్ణ జన్మస్థలంలో నిర్మించారనేది హిందువుల వాదన.
దీనిపై హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మస్థలంలోని మొత్తం 13.37 ఎకరాల భూమిపై హక్కును హిందువులకే కల్పించాలని హిందూసేన డిమాండ్ చేస్తోంది. కాగా, అయోధ్యలోని రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన విషయం తెలిసిందే..