కార్తీక మాసం (Kartika Masam) ఎంత గొప్పదో, కార్తీకమాసంలో వచ్చే సోమవారం (Monday) కూడా అంతే విశిష్టత కలిగినదని వేదాలు చెబుతున్నాయి. సనాతన హిందూ ధర్మంలో కార్తీక మాసం విశిష్టత గురించి పురాణాలు గొప్పగా తెలిపాయి. అదీగాక కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాల వల్ల సద్గతులు ప్రాప్తిస్తాయని వశిష్ట మహర్షి వివరించినట్టు చెబుతారు. అయితే కార్తీక మాసంలో నిత్య పూజల వల్ల కలిగే పుణ్యం.. వ్రతాలు చేయడం వల్ల రెట్టింపు అవుతుందని హిందూ ధర్మం తెలుపుతుంది.
కార్తీక మాస వ్రత విధి విధానాలను కార్తీక పురాణం (Kartika Puranam)లో వివరించారు. కార్తీక వ్రతం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం వస్తుందని వశిష్ట మహర్షి (Vashishta Maharshi) తెలిపినట్టు చెబుతారు. ఇక కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని, వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు.
కార్తీక సోమవార వ్రత విధానంలో ఆచరించే ఆరు పద్ధతుల గురించి తెలుసుకుంటే.. అవి ఉపవాసము (Fasting)..ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము అని వశిష్ట మహర్షి తెలిపారు. కార్తీక సోమవారం నాడు రోజంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తే దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠ మహర్షి తెలిపారు.
కార్తీక సోమవార దీక్ష చేయడం సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన, దాన, జపాలు యధావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపారు. దీనిని ఏక భుక్తము అంటారు.. పగలంతా ఉపవాసం చేసి, ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం గాని ఉపహారాన్ని గానీ తీసుకుంటే నక్తము అంటారు అని వశిష్ఠుడు తెలిపారు.
భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా, ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని అయాచితము అంటారని, ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చని వశిష్ఠుడు తెలిపారు. మరోవైపు ఉపవాసా శక్తిలేని వారు స్నాన, జపాదులు చేసిన సరిపోతుందని.. మంత్ర విధులు కూడా రాని వారు, స్నాన, జపాదులు తెలియనివారు నువ్వులను దానం చేసినా చాలని వశిష్టుడు తెలిపారు. కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా వారు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారని, శివసాయుజ్యం లభిస్తుందని వశిష్టుడు వివరిస్తున్నారు..