దేశాన్ని వరుసగా ప్రకృతి విపత్తులు హడలెత్తిస్తున్నాయి.. తాజాగా ఇండోనేషియా (Indonesia)లో అగ్నిపర్వతం (Volcano) మరోసారి విస్ఫోటనం చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు రిమోట్ మౌంట్ రువాంగ్ (Remote Mount Ruang) అగ్నిపర్వతం రెండు సార్లుకు పైగా పేలిందని ఒక ప్రకటనలో పేర్కొన్న అధికారులు హైరిస్క్ హెచ్చరికలను జారీ చేశారు.
మరోవైపు సముద్రంలోకి లావా అధికంగా జారిపోతుండటం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో వేలాది మంది ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిపర్వతం నుంచి ఐదు కిలోమీటర్ల అంటే సుమారు 3.1 మైళ్ళు కంటే ఎక్కువ బూడిదతో కమ్మేసిందని తెలిపిన వారు.. అధిక స్థాయిలో లావా (Lava) బయటకు వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రక్షణ చర్యల్లో వేగం పెంచి.. స్థానికంగా ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సునామీ హెచ్చరిక కారణంగా పొరుగున ఉన్న తగులాండాంగ్ ద్వీపం నుంచి ఉత్తరాన ఉన్న సియావు ద్వీపానికి వేలాది మందిని తరలించడంలో సహాయపడటానికి ఒక రెస్క్యూ షిప్, యుద్ధనౌకను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానిక విపత్తు ఉపశమన సంస్థ, మిలిటరీ, పోలీసులు నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు.
మరోవైపు అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి మేఘాలు, లావా విపరీతంగా ఉండటంతో ప్రజలను రువాంగ్ చుట్టూ ఏడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఇండోనేషియాలో ఆరు సార్లకు పైగా అగ్నిపర్వత పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే.. దీంతో ఇక్కడ నివసించే ప్రజలకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి..