భూ కుంభకోణం కేసులో అరెస్టయిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) అరెస్టయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్, ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆయన పిటిషన్ వేశారు. రెండు నెలలుగా అరెస్టుకు వ్యతిరేకంగా తన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు రిజర్వ్ చేసింది.
తాజాగా ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తన నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసులో తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, జనవరి 31న ఈడీ సోరెన్‌ను అరెస్టు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం హేమంత్ సోరెన్‌ను ముందుగా ఝార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని కోరింది.
వాస్తవానికి హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 28 న విచారణ పూర్తి చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎస్ చంద్రశేఖర్, జస్టిస్ నవనీత్ కుమార్ ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగమైన కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.
లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, హేమంత్ సోరెన్ అరెస్టు లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జరిగినట్లు ఆరోపిస్తున్నాయి. ప్రజలే సమాధానం చెబుతారన్నారని అంటున్నాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థ తన పని తాను చేసుకుంటోందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.