Telugu News » Yemen: ఎర్రసముద్రంలో అలజడి… నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి..!

Yemen: ఎర్రసముద్రంలో అలజడి… నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి..!

ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ ధ్వంసమైంది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారు. తమ డ్రోన్‌పై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ నిర్ధారించింది.

by Mano

గాజా – ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఎర్రసముద్రంలో మళ్లీ అలజడి మొదలైంది. యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ ధ్వంసమైంది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారు. తమ డ్రోన్‌పై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ నిర్ధారించింది.

Yemen: Turmoil in the Red Sea... Ship, US drone attack...!

హౌతీలు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ తమ దాడిని నిలిపివేస్తే, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో దాడులను ఆపేస్తామని హౌతీలు ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఇజ్రాయెల్‌లోని ఈలాట్ పోర్ట్ వద్ద ట్రాఫిక్‌ను ప్రభావితం చేశాయి. మరోవైపు యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి వారం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

US సెంట్రల్ కమాండ్ (CENTCOM) వివరాల ప్రకారం.. హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ బ్రిటిష్ చమురు నౌక “ఆండ్రోమెడా స్టార్”ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. నౌకకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే నౌకకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గగనతలంలో శత్రు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు యూఎస్ మిలిటరీకి చెందిన MQ-9 రీపర్ డ్రోన్‌‌ని కాల్చివేశారని అధికారులు చెబుతున్నారు.

దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు కాల్చివేసిన మూడో అమెరికా డ్రోన్ ఇది. మొదటి పేలుడు నౌకకు సమీపంలో సంభవించిందని, రెండోసారి జరిపిన దాడిలో నౌక ధ్వంసం అయినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, 2023 నవంబర్‌లో హౌతీలు డ్రోన్లపై దాడి చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్, యెమెన్‌లోని అల్-ముఖా (మోచా) సమీపంలో ఎంవీ ఆండ్రోమెడా స్టార్ ఓడపై దాడులను నిర్ధారించింది.

You may also like

Leave a Comment