చత్తీస్ ఘడ్ (Chhattisgarh), రాయ్ పూర్ (Raipur)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. కోటా ప్రాంతంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ (Transformer) పేలుడుతో ఈ ఘొరం జరిగినట్లు సమాచారం. కరెంట్ ఆయిల్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో సబ్ స్టేషన్ లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లకు అంటుకొని, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొన్నాయి.
మరోవైపు ఎండ తీవ్రత వలన భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికంగా ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా పోలీసులు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు కంపెనీ ప్రాంగణంలో కరెంట్ ఆయిల్ ఉండడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గమనించి వెంటనే లోపల ఉన్న ఆయిల్ బ్యారెల్స్ని బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు.