రాష్ట్రంలో ఎన్నికల హడావుడి.. వరుసగా పార్టీలను హడలెత్తిస్తుంది.. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. ఐదు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) వచ్చి.. బీఆర్ఎస్ (BRS)ను మరింత ఇరుకున పడవేసాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఇంకా పార్టీ ఉనికి ఉందని చాటుదామని భావిస్తున్న తరుణంలో మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక రావడం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
అసలే అధికారం లేక.. కేసుల వెంట పరిగెత్త లేక బీఆర్ఎస్ అధినేత సమస్యలతో సతమతం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎలాగో కూతురు కవిత జైలు టెన్షన్ హైరానా పెడుతున్న సంగతి తెలిసిందే.. మొత్తానికి కారు పార్టీని చుట్టుముట్టిన సమస్యల చిట్టా పెద్దగానే ఉందని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ (Warangal), పట్టభద్రుల ఉపఎన్నిక సవాల్ గా మారింది. మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో పల్లా రాజీనామా తప్పనిసరి అయింది. ఉపఎన్నిక వచ్చేసింది. ఇక కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna)ను ప్రకటించారు. ఆయన గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడం వల్ల ఎలాగైనా విజయం తప్పని సరిగ్గా మారింది.
తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక కావడం వల్ల గెలుపు మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇక్కడే సమస్య వచ్చింది. అభ్యర్థిగా ఎవరిని దింపాలన్నది పజిల్ గా మారింది. ఎంపీ పోటీకే ముందుకు రాని నేతలు.. ఎమ్మెల్సీ అంటే ఆమడ దూరం వెళ్ళడం జరుగుతున్నారని అంటున్నారు.. అందులో కనీసం ప్రచార గడువు కూడా లేదు. మే 2 నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
మరోవైపు లోక్ సభ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన ఉంది. ఈ సమయంలో అభ్యర్థిని నిలబెడితే గెలవాలి.. లేదా కనీసం రెండో స్థానంలో అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏది జరగకున్నా పరువుపోతుంది. మరి ఈ సమస్యను గులాబీ బాస్ ఎలా పరిష్కరిస్తారో అనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్లో నెలకొంది.