Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
అధికార కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ టార్గెట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(SIX Guarentees) వెంటనే అమలు చేయాలని లేదంటే సీఎం రేవంత్ (Cm Revanth reddY) తన పదవికి రాజీనామా చేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి వెల్లడించారు.
సంగారెడ్డిలో బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాను. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. ఆగస్ట్ 15లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేస్తానని ప్రమాణం చేయు. ఆగస్ట్ 15లోపు పూర్తిగా రుణమాఫీ జరగాలి.
ఒకవేళ మీరు రుణమాఫీ చేస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేయను. ఒకవేళ మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తామని మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ.
ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి మాట తప్పారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం మీ నైజం.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటావా? అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారు.120 రోజులు దాటినా నీ గ్యారెంటీలు ఏమయ్యాయని మేము అడుగుతున్నాం. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ. 2500 మహిళలకు ఎందుకు ఇవ్వలేదు. రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15000 సాయం ఎందుకు చేయలేదు. ధాన్యానికి 500 బోనస్ ఏది. నిరుద్యోగులకు భృతి ఏదీ’ అని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.