Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు ప్రగతి భవన్.. ప్రజా భవన్ (Praja Bhavan) గా మారింది. బయట ఉన్న ఇనుప కంచెలు బద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజా భవన్ దగ్గర భారీగా క్యూ కట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి 10 గంటల సమయంలో ప్రజా భవన్ కు చేరుకున్నారు. సొంత వాహనంలోనే ఆయన ప్రజా దర్బార్ కు వచ్చారు. ప్రజా దర్బార్ లో సీఎం పాల్గొని ఒక్కొక్కరి సమస్యలు వింటూ విజ్ఞప్తులు స్వీకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా పాల్గొన్నారు. ప్రజా దర్బార్ తర్వాత సీఎం సచివాలయానికి వెళ్లారు. పలువురు అధికారులతో సమావేశమయ్యారు.
ప్రజా భవన్ కు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను డిజిటల్ చేస్తున్నారు. వారి డేటాను కలెక్ట్ చేసి సమస్యను నమోదు చేస్తున్నారు. బాధితుల ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు. సమస్య ఏంటీ అనేది తెలుసుకుంటూ.. మొత్తం వివరాలను డేటా ఎంట్రీ చేస్తున్నారు. అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించటం సాధ్యం కాదు కాబట్టి.. మొత్తం సమస్యలను డేటా ఎంట్రీ చేసి తర్వాత ఆయా శాఖల ద్వారా పరిష్కరించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తమతో స్వయంగా మాట్లాడటం.. సమస్యలను వినటంపై బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వరకు తమ సమస్యను తీసుకెళ్లగలిగామని పరిష్కారం లభిస్తుందని ఆశించారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ప్రభుత్వం తర్వాత సీఎం స్థాయి ప్రజా దర్బార్ బంద్ అయింది. గడిచిన పదేండ్లలో కేసీఆర్ సర్కార్ లో ఎక్కడా ప్రజా దర్బార్ కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రేవంత్ హయాంలో ఇది జరుగుతోంది.








