Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
బీఆర్ఎస్ (BRS) నేతలు గల్లీల్లో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). కరీంనగర్ (Karimnagar) లోని రామచంద్రాపూర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గులాబీ నేతలు ఓటుకు రూ.10 వేలు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఎక్స్ పర్ట్ అని విమర్శించారు.
తాను గెలవకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు సంజయ్. 3వ తారీఖున కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హెచ్చరించారు. రాబోయేది పేదల ప్రభుత్వమని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కు 196 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. నగరంలోని రోడ్లన్నీ మోడీ (Modi) సర్కార్ వేయించినవేనని తెలిపారు. నిధులు తీసుకొచ్చేది తాను అయితే.. కేసీఆర్, గంగుల వాళ్ల ఫోటోలు పెట్టుకుని ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్న బండి.. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తానని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఓటు వేసే ముందు కరీంనగర్ ప్రజలు, యువత.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపిస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. కమలం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని.. రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు బండి. గులాబీ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని.. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఒకటో తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని విమర్శించారు. ఇసుక కుప్పలు కన్పిస్తే డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్ గంజాయి మత్తులో ముంచుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గంగుల ఓటమి ఖాయమని.. అందుకే, ఒవైసీ వద్ద మోకరిల్లి పచ్చజెండా పట్టుకున్నారని విమర్శించారు బండి సంజయ్.





