ధరణిలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యల గురించి కమిటీ ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించింది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? అనే వివరాలను చర్చించడానికి మరోసారి ధరణి (Dharani) పునర్నిర్మాణ కమిటీ సమావేశం అయ్యింది.
ఇవాళ సచివాలయం (Secretariat)లో జరగనున్న ఈ సమావేశంలో.. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ (Committee) మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో ఈ పోర్టల్ అందిస్తున్న సేవలు, సాఫ్ట్వేర్ (Software)ను ఉపయోగిస్తున్న విధానం, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ఎదురవుతున్న సమస్యలు చర్చకు వచ్చినట్లు సమాచారం.. ధరణి సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహణ, భూముల సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే విషయాలతో పాటుగా.. పోడు భూముల పట్టాల జారీ, పోర్టల్ వేదికగా దీనికోసం జారీ చేసే ఫాం ‘K’, ‘L’ల నిర్వహణ, షెడ్యూలు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాల నిర్వహణ ఏ విధంగా సాగుతోంది. వీటిలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి వివరాలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు అటవీ, రెవెన్యూ శాఖల భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన అటవీ భూములకు సంబంధించిన అంశాలపై సైతం అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ధరణి సమస్యలపై ఫిర్యాదులు భారీగా వచ్చాయి. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్.. సమావేశానికి తగిన సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు.