Telugu News » Telangana : అక్రమాల పుట్ట.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు..!!

Telangana : అక్రమాల పుట్ట.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు..!!

హెచ్ఎండీఏ నుంచి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, ఈయన హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

by Venu

– హెచ్ఎండీఏ, రెరాలో శివ బాలకృష్ణ అక్రమాలెన్నో!
– అప్లికేషన్లలో తప్పులున్నాయంటూ నగదు డిమాండ్
– లంచంగా విలువైన కానుకల స్వీకరణ
– 45 పేజీలతో శివ బాలకృష్ణ అక్రమాల చిట్టా
– కోర్టు ముందుకు రిమాండ్ రిపోర్ట్
– 50 ప్రాపర్టీస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం
– భూములు, ఫ్లాట్లు, విలువైన వస్తువల లెక్కలన్నీ వివరణ
– వారం రోజుల కస్టడీ కోసం ఏసీబీ పిటిషన్

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి డొంక కదులుతోంది. 45 పేజీల రిమాండ్ రిపోర్టు రెడీ చేసింది ఏసీబీ. ఇందులో ఎన్నో కీలక విషయాలు వెల్లడించింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ డాక్యుమెంట్ల ప్రకారం దాదాపు రూ.5 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్ లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. వీటితో పాటు 99లక్షల నగదు, 4 కార్లు, రూ.8 కోట్లకు పైగా విలువైన గోల్డ్, సిల్వర్, వాచ్ లు, ఫోన్స్, గృహోపకరణాలు సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు అధికారులు.

HMDA Former Director Shiva Balakrishna 45 Pages Remand Report

బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని ఏసీబీ తెలిపింది. 50 ప్రాపర్టీస్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. 4.9 కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్థులున్నట్టు తెలిపింది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్‌ లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్ ఉన్నట్టు నిర్ధారించామని చెప్పింది. నాగర్ కర్నూల్‌ లో 12.13 ఎకరాల జాగా,  చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భూములు, ప్లాట్స్ ఉన్నాయని చెప్పింది. రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 120 రిస్ట్ వాచీలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 32 లక్షలు ఉంటుందని చెప్పింది. ఐ ఫోన్స్ తోపాటు ట్యాబ్స్ 31 స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. హెచ్‌ఎండీఏలోని 3 జోన్లపై బాగా పట్టు ఉన్న శివ బాలకృష్ణ.. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని.. లే అవుట్ అనుమతుల కోసం సైతం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ప్లాట్స్‌ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా తీసుకొన్నట్టు అధికారులు గుర్తించారు.

హెచ్‌ఎండీఏలో కీలక పోస్టులో సుదీర్ఘ కాలంగా పనిచేసిన బాలకృష్ణ పర్యవేక్షణలో ఉన్న జోన్లలో సింహభాగం ప్రస్తుతం విలువైన ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు, ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందే వట్టినాగుల పల్లి పరిసరాల్లో భూవినియోగ మార్పిడి ఉత్తర్వుల జారీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. కమర్షియల్ నిర్మాణాలకు వీలుగా పెద్ద మొత్తంలో భూవినియోగ మార్పిడి చేయడం వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే.. రెండేళ్ల క్రితమే ఏసీబీ అధికారులకు శివ బాలకృష్ణపై ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ప్రస్తుతం రెరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, ఈయన హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

తన దగ్గరి బంధువులను ఔట్‌ సోర్సింగ్‌ ఉ‍ద్యోగులుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్‌ లీడర్లు కూడా ఈ అవినీతిలో మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఓ కన్సల్టెంట్‌ పై ఫోకస్ చేశారు. కాగా ఈ విషయంలో మరింత సమాచారం కోసం బాలకృష్ణను ఏసీబీ వారం రోజుల కస్టడీ కోరుతోంది. ఇప్పటికే అరెస్టయిన శివ బాలకృష్ణ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అయితే.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తోంది.

You may also like

Leave a Comment