రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా చేవెళ్ల నియోజక వర్గం చందనవెల్లిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పర్యటించారు. పర్యటన సందర్బంగా చందనపల్లి భూ బాధితులు తమ గోడను భట్టి విక్రమార్కకు మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని భట్టి విక్రమార్క దగ్గర వాపోయారు.
భూసేకరణలో అవకతవకలు జరిగాయని డిప్యూటీ సీఎం దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. భూసేకరణ విషయంలో నష్ట పరిహారం నిర్వాసితులకు కాకుండా బోగన్ లబ్దిదారులకు దక్కిందని వెల్లడించారు. భూ సేకరణలో పట్టాదారులకు నాలుగు ఎకరాలు ఉంటే దానికి బదులు రెండు ఎకరాలను మాత్రమే రికార్డుల్లో చూపించి సగం భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారని వాపోయారు.
తమకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా డిప్యూటీ సీఎంను బాధితులు కోరారు. రైతులు ఇచ్చిన భూముల్లో ఇండస్ట్రీలను కూడా స్థాపించారని, స్థానికులకు ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఉద్యోగాలు కూడా కల్పించలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రుల పర్యటన సమయంలో వారిని కలవకుండా భూ బాధితులను పోలీసులు నిర్భందించే వారని తెలిపారు.
కానీ ఇప్పుడు తమకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. భూసేకరణలో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. దీనిపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ….. చందనవెల్లిలోని సర్వే నంబర్ 190లో భూసేకరణలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.