తెలంగాణ (Telangana) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ (TSPSC) ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ పదవికి మాజీ డీజీపీ (Former DGP) మహేందర్‌రెడ్డి (Mahender Reddy)తో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. అయితే వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్, కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమై పరిశీలించినట్లు సమాచారం..
ఛైర్మన్ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు సమాచారం.
మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను కలసి చర్చించారు. దీనికితోడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఈ పోస్టుల కోసం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు..