Trump : ఎన్నికల ఫ్రాడ్ కేసులో అరెస్టు అయ్యేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్ధమయ్యారు. 2020 లో జరిగిన జార్జియా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నించారన్న ఆరోపణల కేసు ఆయన చుట్టూ మరింత బిగుస్తోంది. గురువారం మధ్యాహ్నం తాను అట్లాంటా వెళ్తున్నానని, అక్కడి ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులను ఎదుర్కోవలసి ఉందని తన ‘ ట్రూత్’ సామాజిక వేదికపై పోస్ట్ పెట్టారు. 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేయకుండా చూసేందుకు ఫూల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫని విల్లిస్, జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు యత్నిస్తున్నారని అయన ఆరోపించారు. ‘మీరు నమ్ముతారా ? నేను గురువారం అరెస్టయ్యేందుకు అట్లాంటా వెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.
తమ క్లయింటు అరెస్టు కాకుండా చూసేందుకు ట్రంప్ తరఫు లాయర్లు జార్జియా అధికారులతో 2 లక్షల డాలర్ల మేర బాండుకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే తన విచారణకు ముందు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ట్రంప్ ఈ మొత్తంలో 20 వేల డాలర్లను మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఈ కేసులో సాక్షులను ఎవరినీ బెదిరించబోనన్న షరతుకు ఆయన అంగీకరించారు. కానీ దీన్ని ఉల్లంఘించిన పక్షంలో విచారణకు ముందే ఆయనను జైలుకు పంపవచ్చు.
విచారణ ముగిసేంతవరకు ట్రంప్, ఈ కేసులోని డిఫెండెంట్లు తమ లాయర్లతో తప్ప మరెవరితోనూ ఒకరికొకరు మాట్లాడుకోరాదన్న నిబంధన ఉంది. ట్రంప్ పైన, మరో 19 మందిపైన 41 అభియోగాలు నమోదయ్యాయి. వ్యవస్థీకృత నేరాలనివారణకు ఉద్దేశించిన రాకెటీర్ ఇన్ ఫ్లుయెన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ వీరిపై కత్తిలా వేలాడుతోంది.ట్రంప్ లొంగిపోయిన పక్షంలో ఇతర డిఫెండెంట్ల మాదిరే ఆయనను ట్రీట్ చేయడం జరుగుతుందని ఫుల్టన్ కౌంటీ అధికారులు తెలిపారు.
కాగా ఈ వ్యవహారాన్నంతా అధ్యక్షుడు జోబైడెన్ నేతృత్వం లోని జస్టిస్ డిపార్ట్మెంట్ సమన్వయం చేస్తోందని, ఫని విల్లీస్ దీన్ని ప్రచారం చేసుకుని డబ్బు పోగు చేసుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇక అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నవారితో బుధవారం ఫాక్స్ న్యూస్ నిర్వహించే టీవీ డిబేట్ లో పాల్గొనబోనని ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ ఓటర్ల అభిమతం తెలుసుకునేందుకు ఉద్దేశించి నిర్వహించిన వివిధ సర్వేల్లో అందరికన్నా ట్రంప్ ముందున్నారు. ఒపీనియన్ పోల్ లో ఆయనకు 56 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఇదే సమయంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ఇతర పోటీదారుల కన్నా ముందంజలో ఉన్నారు.