గ్రూపు-1 ప్రిలిమినరీ (Group 1 Preliminary) పరీక్ష రద్దు నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCr) కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ లేఖ రాశారు. గ్రూపు-1 పరీక్ష రద్దు నేపథ్యంలో చర్యలపై లేఖలో ఆయన పలు సూచనలు చేశారు. గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ సర్కార్ చెంపెట్టు లాంటిదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతి ఫలమే ఈ దుస్థితి అని ఆయన మండిపడ్డారు.
మీరు చేస్తున్న అన్యాయమైన దుర్మార్గమైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో శిక్షతప్పదని హెచ్చరించారు. తొలి దశ నుంచి మలి దశ వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్ధులదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్ధులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉందని వాపోయారు.
ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు ఇలా చాలా ఘటనలు జరిగాయన్నారు. అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో బీఆర్ఎస్ మోసం పరాకాష్టం చేరిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత జరిగినా మీ ప్రభుత్వంలో చలనం లేదని ఫైర్ అయ్యారు. ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించిన పాపాన పోలేదన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొందన్నారు. కానీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదన్నారు.
సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ జంగ్ సైరన్‌ల పేరుతో కాంగ్రెస్ పోరాటాలు చేసిందన్నారు. చివరకు వాటిని కూడా పోలీసులను అడ్డుపెట్టి అణచి వేసే ప్రయత్నం చేశారన్నారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేస్తారనే ఆశతో 30 లక్షల మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారని అన్నారు. తల్లి దండ్రులు పంపించే చాలిచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరవుతున్నారన్నారు.
మీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పేపర్ లీకేజీ చోటు చేసుకోవడంతో గతేడాది గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారన్నారు. దీంతో 2 లక్షల 80 వేల మంది విద్యార్ధుల జీవితం ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. ఇంత జరిగినా పేపర్ లీకేజీపై సరైన చర్యలు తీసుకోకుండా, అందుకు కారణమైన వారిని శిక్షించకుండా మరోసారి గ్రూపు1 పరీక్ష నిర్వహించారన్నారు.
తప్పులు దిద్దుకొని ఈ సారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారానుకుంటే మీ వక్రబుద్ధితో పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారన్నారు. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, హాల్ టికెట్ నెంబర్‌తో ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం కనీస బాధ్యత అని అన్నారు. కానీ బయోమెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం వంటి దారుణమైన తప్పులకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు.
పేపర్ల లీకేజీ స్కాంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలకుండా కఠినంగా చర్యలు తీసుకుని వుంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. అప్పుడు పరీక్షలు రద్దు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష విద్యార్ధులకు విధించారన్నారు. ఇంత జరిగినా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తారని, సంస్కరిస్తారనే నమ్మకం, విశ్వాసం తెలంగాణ యువత, నిరుద్యోగులకు లేదన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఒక భరోసా కల్పించాలని భావిస్తోందన్నారు. తెలంగాణ విద్యార్ధులు, యువత నిరాశపడొద్దన్నారు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. ఇప్పటికే యువత, విద్యార్ధి కోసం యూత్ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
ప్రతి ఒక్క నిరుద్యోగికీ నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిర్ణీత సమయంలోగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అసలు పరీక్షలు రద్దు చేయడం కాదు. కేసీఆర్ సర్కారునే రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. తెలంగాణలో న్యాయంగా ఉద్యోగ నియామకాలు జరగాలంటే కేసీఆర్ సర్కారును రద్దు చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమన్నారు.