నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసినట్టే కేసీఆర్ సోనియా గాంధీని కూడా మోసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ సర్కార్ నెరవేరుస్తుందని తొమ్మిదేండ్ల పాటు సోనియా గాంధీ ఎదురు చూశారని చెప్పారు. తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చారంటూ కేసీఆర్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వెల్లడించారు. అందువల్లే సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేటీఆర్, హరీశ్ రావులు కుక్కల్లాగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర డీజీపీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నవారిపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్ల నిఘా పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేశారట అని పేర్కొన్నారు. ఆ జాబితాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారట అని వెల్లడించారు. కొంతమందిని నేరుగా కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ గుర్తు పెట్టుకో ఇంకా మీ అధికారం 45 రోజులే అని, ఆ తర్వాత తమ ప్రభుత్వం వస్తుందన్నారు.
అధికారంలోకి రాగాలనే ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలంటూ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అధికారులంతా అధికారుల్లాగానే వ్యవహరించండన్నారు. అంతే కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్లా పని చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం తమదేనన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ మొదట ఇచ్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? అని అడిగారు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. ఆరోగ్య శ్రీ పథకం తీసుకు వచ్చి పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు అనుభవిస్తున్న పదవులన్నీ కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని అన్నారు. వాళ్ల పదవులు సోనియాగాంధీ దయ అని చెప్పారు.