పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం తెలంగాణ(Telangana)లోని ప్రధాన పార్టీలు సికింద్రాబాద్(Secunderabad) సెగ్మెంట్ మీద ఫోకస్ చేశాయి. ఈ సీటు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(G.kishan reddy) పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కిషన్ రెడ్డికి ప్రత్యర్థిగా నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ నిలబడ్డారు.
ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారంలో గులాబీ పార్టీ ఉన్నా సికింద్రాబాద్ ప్రజలు మాత్రం మోడీ నాయకత్వంలోని బీజేపీకి జై కొట్టారు. ప్రస్తుతం కూడా సికింద్రాబాద్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా జి కిషన్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోంది.
దానికి తోడు ‘అబ్ కి బార్ 400 పార్’, ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్’ నినాదంతో బీజేపీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల ప్రధాని మోడీ మూడు సార్లు తెలంగాణలో పర్యటించారు.మల్కాజిగిరిలో రోడ్ షో, నాగర్ కర్నూల్ సభ, జగిత్యాల నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఈసారి బీజేపీకి ఓటేసి నన్ను గెలిస్తే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మాటిచ్చారు. ఇది మాములు గ్యారెంటీ కాదని, మోడీ గ్యారెంటీ అని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(PadmaRao Goud) పోటీకి సిద్ధమయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. పద్మారావుకు ఉద్యమనేతగా మంచి గుర్తింపు ఉంది. మంత్రి, డిప్యూటీ స్పీకర్గాను పనిచేసిన అనుభవం ఉంది. దీనికి తోడు తన సామాజిక వర్గం సపోర్టు గట్టిగా ఉంది.ఇక ఈయనకు తలసాని సపోర్టుగా కూడా గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో యాదవ్ వర్గం ప్రజలు అధికంగా ఉన్నారు. ఇది పద్మారావుకు ఎన్నికల్లో ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. బీజేపీకి కూడా గౌడ, యాదవ సామాజిక వర్గం ప్రజల మద్దతు మెండుగానే ఉంది.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన MlA దానం నాగేందర్(Danam Nagender) పోటీచేస్తున్నారు. ఈయనకు మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏ పార్టీ పవర్ లో ఉంటే వారికే అధికంగా ఎంపీ దక్కే చాన్స్ ఉంటుంది. కానీ దానంపై చాలా వరకు భూకబ్జా, బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలు ఉన్నాయి. ఈసారి దానంకు ప్రజలు మొండిచూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో బీజేపీ, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి.