Telugu News » త్రిముఖ పోరు.. పైచేయి ఎవ‌రిది?

త్రిముఖ పోరు.. పైచేయి ఎవ‌రిది?

by admin
triangle fight in telangana

ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర పడుతోంది. పార్టీల‌న్నీ స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ జోరు పెంచాయి. శ‌ర‌ణం లేదు ఇక ర‌ణ‌మే అంటూ కార్య‌క్ర‌మాలను స్పీడ‌ప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ అటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ఇటు పార్టీ ప్రోగ్రామ్స్ తో దూకుడుగా ఉండ‌గా.. వంద రోజుల యాక్ష‌న్ ప్లాన్ కు దిగింది బీజేపీ. ఇటు కాంగ్రెస్ కూడా పీఏసీ స‌మావేశం నిర్వ‌హించి.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ఓ క్లారిటీకి వ‌చ్చేసింది. దీంతో తెలంగాణ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

triangle fight in telangana

అధికార బీఆర్ఎస్ ఈసారి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తోంది. కానీ, స‌ర్వేలు అనుకూలంగా రాలేద‌ని స‌మాచారం. సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి, ఎమ్మెల్యేల‌ గ్రాఫ్ పై స‌ర్వేలు చేయిస్తుంటారు. అలా, రానున్న ఎన్నిక‌ల్లో భారీ షాకులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ నేత‌లకు ఫుల్ క్లాస్ తీసుకున్న కేసీఆర్.. జ‌నంలోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. అందుకే, గులాబీ నేత‌లు ఈమ‌ధ్య కాలంలో గ్రామాల బాట ప‌ట్టారు. కానీ, ప్ర‌తిప‌క్షాలు మాత్రం మ‌రోసారి బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ లేద‌ని అంటున్నాయి.

బీజేపీలో ఈమ‌ధ్య కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ ప‌గ్గాలు కిష‌న్ రెడ్డికి అప్ప‌గించి, ఈట‌ల రాజేంద‌ర్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చింది అధిష్టానం. ఆయ‌న‌కు బీజేపీ రాష్ట్ర ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈమార్పు బీజేపీ గ్రాఫ్ ను అమాంతం పెంచింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంత‌కుముందు వ‌ర‌కు ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలు బూస్ట‌ప్ ఇచ్చినా త‌ర్వాత రానురాను నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డి రేసులో బీజేపీ వెనుక‌బ‌డింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎప్పుడైతే ఈట‌ల‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారో అప్ప‌టినుంచి క‌మ‌ల‌నాథుల్లో జోష్ పెరిగింది. ఎందుకంటే, ఈట‌ల బీసీ లీడ‌ర్. ఉద్య‌మ‌కారుడిగా గుర్తింపు ఉంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న్ను అభిమానిస్తారు. ముఖ్యంగా ముదిరాజ్, బడుగు బలహీన వర్గాలు రాజేంద‌ర్ ను బాగా ఓన్ చేసుకున్నాయి. ఈ ప‌రిణామాల త‌ర్వాత బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఈట‌ల వెంట న‌డుస్తున్నారు. పార్టీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి సైతం అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యంలో ఈట‌ల‌కున్న ప్ర‌యారిటీని చెప్పేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్నుంచి చివ‌రి వ‌ర‌కు త‌న వెంటే ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ముందుకెళ్లి కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు క‌మ‌ల‌నాథులు.

ఇటు కాంగ్రెస్ కూడా దూకుడుగా ఉంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లోనూ అధికారం సాధిస్తామ‌ని హ‌స్తం నేత‌లు ధీమాగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చేది తామేన‌ని.. ఈసారి ప‌క్కాగా గెలిచి తీరుతామ‌ని చెబుతున్నారు. గాంధీ భ‌వ‌న్ లో పీఏసీ స‌మావేశం ఏర్పాటు చేసుకున్న నేత‌లు.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. కొత్త ప‌థ‌కాలు, ప్ర‌జాక‌ర్ష‌క కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక అంశాల‌పై చ‌ర్చించి ముందుకు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ వంద రోజులు క‌ష్ట‌ప‌డ‌దాం.. అధికారం సాధిద్దామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం నూరిపోసి పోరాటానికి సై అంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఎల‌క్ష‌న్ యుద్ధం స్పీడ్ అందుకుంది. ప్ర‌ధాన పార్టీలు గెలుపు ఆశ‌ల‌తో దూసుకెళ్తున్నాయి. మ‌రి, ఈ త్రిముఖ పోరులో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో చూడాలి.

You may also like

Leave a Comment