మణిపూర్ (Manipur) లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన నుంచి దేశం తేరుకోకముందే రాజస్థాన్ (Rajasthan) లోనూ అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో, పిహార్ లో ఓ గిరిజన యువతి(21)పై దాడి చేసి, నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఆ సమయంలో వీడియో కూడా తీశారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ మహిళపై ఆమె భర్త, అతడి సోదరులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రక్షించాలంటూ బాధిత మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుండడంతోనే ఆమె భర్త దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత యువతి వేరే గ్రామంలో ఉన్న సమయంలో ఆమెను అత్తింటి వారు కిడ్నాప్ చేసి సొంత గ్రామానికి తీసుకువచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.ఈ ఘటనను ఖండిస్తున్నానని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పారు. యువతిని నగ్నంగా ఊరేగించిన ఘటనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ దారుణాన్ని ఖండించారు. ఇది హద్దులులేని అమానవీయ ఘటన అని వ్యాఖ్యానించారు.
ఘటన జరిగిన రెండు రోజులైనా పోలీసులు రిపోర్టు సిద్ధం చేయలేదేంటని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘‘మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఈ ఘటన బయటపెట్టిందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు రాహుల్ గాంధీ.. రాజస్థాన్ ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారా? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరతారా?’’ అని ప్రశ్నించారు.