కెనడా ప్రధాని (Canadian Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఎట్టకేళకు భారత్‌ను వీడారు. జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్ వచ్చిన ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సుమారు 36 గంటల పాటు భారత్‌లోనే ఉండిపోవాల్సివచ్చింది.
ఆదివారం సదస్సు ముగిసిన తర్వాత ట్రూడో ఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉండగా ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు.
ఇక అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.చివరికి మంగళవారం విమానంలోని సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో విమానం గాల్లోకి ఎగిరేందుకు అనుమతి లభించింది.
ఆ క్రమంలో ఆయన దాదాపు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడా బయలుదేరి వెళ్లారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన బ్యాకప్ విమానాన్ని లండన్(London)కు దారిమళ్లించారు. అయితే ఈ విమానాన్ని ఎందుకు దారిమళ్లించారనే వివరాలు వెల్లడికాలేదు.
సమ్మిట్ కోసం ట్రూడో శుక్రవారం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిశాయి.
తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ట్రూడో ఆయన బృందం న్యూఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాలి. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వారంతా భారత్‌లోనే ఉండిపోయారు.