తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(TS Assembly Session) రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. గత వారం ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. కాగా, గురువారం స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. తెలంగాణ స్పీకర్(Telangana Speaker)గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో టెక్స్‌టైల్ మంత్రిగా పనిచేశారు. గుడిసెల వెంకటస్వామి అల్లుడైన గడ్డం ప్రసాద్ కుమార్ మూడో సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, అసెంబ్లీ స్పీకర్ పదవికి ఇతర నామినేషన్లు ఏమీ రాకపోతే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణ శాసన మండలికి కొత్త భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజాగా జూబ్లీహాల్ ప్రాంగణంలోనే శాసన మండలికి కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1937 ప్రాంతంలో జూబ్లీహాల్ భవనం నిర్మించారు. హై2006లో మండలిని వైఎస్సార్ పునరుద్దరించినప్పటి నుంచి ఆ భవనంలోనే శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాతభవనం కూల్చివేతకు అనుమతులు లభిస్తాయా? అనే అనుమానాల మధ్య కొత్త భవనం నిర్మించే వరకు సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారనే సందేహాలూ లేకపోలేదు.