తెలంగాణ (Telangana)లో అధికారుల ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నెల 30 న జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే అంతా సిద్దం చేసుకున్న అధికారులు.. ఏర్పాట్లను స్పీడ్ అప్ చేశారు.. మరోవైపు సమయం మించిపోతుండటంతో అభ్యర్థులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హామీలు, మేనిఫెస్టోలతో ఓటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
ఈసీ (EC) కూడా ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం కోసం నియమాలను కఠినంగా అమలుచేస్తుంది. ఈ క్రమంలో ఓటు వేయడం ఇష్టం లేని అభ్యర్థుల కోసం ఇప్పటికే నోటాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటా (Nota) కోసం అధికారులు రెండు చోట్లా అదనపు బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్ (Sanat Nagar)..నర్సంపేట (Narsampeta)లో అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు సనత్ నగర్ లో 18 మంది నామినేషన్లు వేయగా.. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. నర్సంపేటలోనూ 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకే ఛాన్స్ ఉండటంతో అంతకు మించితే మరో యూనిట్ ను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. అయితే ఐదేళ్ల క్రితం గరిష్ఠంగా నాలుగు యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండేది. అంతకు మించితే కంట్రోల్ యూనిట్ తీసుకునేది కాదు..
కానీ.. 2019 నుంచి ప్రవేశ పెట్టిన ఎం-టీ రకం ఈవీఎంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. వీటిలో ఒక్కో కంట్రోల్ యూనిట్ కు.. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతికతను డెవలప్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఒక నియోజకవర్గంలో 384 మంది ఎన్నికల బరిలో ఉన్నా ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది. మరోవైపు 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఎం-టీ రకం ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు.