రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొలువుదీరిన వేళ.. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచిత ప్రయాణం చేయవచ్చు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి మహాలక్ష్మి(Mahalaxmi), ఆరోగ్య శ్రీ పథకాల(Arogyasri scheme)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ ఉచిత పథకం కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో లగ్జరీ, ఏసీ మెట్రో డీలక్స్ బస్సుల్లో వెళ్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ధ్రువీకరణ కోసం ఏదైనా గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారికి కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ.10లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో 1310 ఆసుపత్రుల్లో (293 ప్రైవేట్, 198 ప్రభుత్వ, 809 పీహెచ్‌సీ) ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 1,376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలు చేయనున్నారు. రాష్ట్రంలో 77 లక్షల 19వేల మంది ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి.