ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు వర్షం వచ్చేలా మారుతున్న వాతావరణం.. మొత్తానికి మిశ్రమ వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో రెండు రోజుల క్రితం వరకి ఉండేవి.. కానీ నిన్నటి నుంచి భానుడు తన ప్రతాపంతో హడలెత్తిస్తున్నాడు.. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు (Temperatures) ఒక్కసారిగా పెరగడంతో జన జీవనం ఉక్కపోతతో అల్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి..
వేడిని తట్టుకోలేని జనం ఉదయం 8 తర్వాత బయటకు రావాలంటే జంకుతున్నారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad) మహానగరం మధ్యాహ్నం సమయంలో కర్ఫ్యూని తలపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే మండి పోతున్న ఎండలను తట్టుకోలేక పోతున్న ప్రజలకి వాతావరణ శాఖ (Meteorology Department) షాక్ న్యూస్ తెలిపారు..
రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.మరోవైపు నగరంలో నేడు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రేపు, ఎల్లుండి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగుతాయని అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న ఈ రోజు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.