కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తెలంగాణ(Telangana)లో మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించారు. అయితే, ఈ ఉచిత ప్రయాణంపై తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కీలక ప్రకటన చేసింది.
బస్సుల్లో మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ(TSRTC) మరోసారి స్పష్టతను ఇచ్చింది. ఇతర రాష్ట్రాల మహిళలు కచ్చితంగా ఛార్జీ చెల్లించాల్సిందేనని తెలిపింది. ఐడీల్లో ఫొటోలు అస్పష్టంగా ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
మహాలక్ష్మి పథకం కేవలం తెలంగాణ మహిళలకే వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది. రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించేందుకు ప్రభుత్వం జారీచేసిన ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డు చూపించాలని పేర్కొంది. అందులో ఇతర రాష్ట్రాలకు చెందినట్లు ఉంటే తప్పకుండా ఛార్జ్ చెల్లించాలని తెలిపింది.
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా కండక్టర్ గుర్తించి నిబంధనల ప్రకారం టికెట్ తీసుకోవాలని సూచించాడు. దీంతో ఆ మహిళ కర్ణాటకలోనూ మహిళలకు ఉచిత ప్రయాణమేనని, తెలంగాణలో ఎందుకు అనుమతివ్వరని నిలదీసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.