TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డిని నియమించడంలోని ఔచిత్యాన్ని ఏపీ సాధు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సంస్ధ ఆధ్వర్యాన సభ్యులు ‘సేవ్ తిరుమల-సేవ్ టీటీడీ అని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. హిందువులను ఈ పదవిలో నియమించాలని, తిరుమలలో నడక మార్గం వద్ద విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. నాస్తికుడు, క్రైస్తవ మత ఆచారం ప్రకారం తన కుమార్తె వివాహం చేసిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించడమేమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఈ సంస్థ అధ్యక్షుడు, శ్రీకాకుళానికి చెందిన ఆనంద ఆశ్రమ పీఠం నిర్వాహకులు శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ భగవంతుని పట్ల భక్తిప్రపత్తులు, విశ్వాసం గల హిందువులను ఈ పదవిలో నియమించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వల్ల టీటీడీలో గతంలో కూడా ఎన్నో తప్పులు జరిగాయన్నారు. ఇలాంటి ధార్మిక సంస్ధను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు.
వన్య ప్రాణుల నుంచి రక్షణ కోసం భక్తులకు చేతి కర్రలు ఇస్తామనడం సరికాదని, ఎన్ని వేలమందికి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తిరుమల చరిత్రలో ఇలాంటి నిర్ణయాలను లోగడ ఎవరూ తీసుకోలేదన్నారు. అలిపిరి నడక మార్గంలో ఆంక్షలను తొలగించకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
టీటీడీ ఈవో నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల చిన్నారిపై చిరుత దాడి చేసిందని ఆరోపించిన శ్రీనివాసానంద సరస్వతి .. ఆయనను పదవి నుంచి తొలగించాలని.. ఐఏఎస్ కాని అధికారిని ఈవో స్థానంలో కూర్చోబెడితే ఏం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కాగా అలిపిరి మార్గంలో విధించిన ఆంక్షల కారణంగా ఈ మార్గంలో వస్తున్న భక్తుల సంఖ్య 3 వేలకు పడిపోయింది.