– తిరుమలలో పెరిగిన రద్దీ
– వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
– సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఏడుకొండలు
– జనవరి 1 వరకు దర్శన భాగ్యం
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఇవాళ తెల్లవారుజామున ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి.
జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించే దిశగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేసింది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, పరిసరాల్లో అత్యవసర సమయాల కోసం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వేకువజామున 1.45 నుంచి ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.
తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేశారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ కౌంటర్లలో టోకెన్లు జారీ చేశారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు.
ఇక 300 రూపాయల టికెట్లకు సంబంధించి.. 2.25 లక్షల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ లో ఇప్పటికే భక్తులకు జారీ చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు తిరుమలలో కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కరోనా మళ్లీ కలకలం రేపుతుండడంతో భక్తులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ.