తిరుమల.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది హిందువులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. భక్తితో శ్రీవారి సేవలో తరిస్తుంటారు. అయితే.. ఇలాంటి పవిత్రమైన ఆలయానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ (TTD Chairman) పదవి చుట్టూ వివాదాలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
గత రెండు పర్యాయాలుగా సీఎం జగన్(CM Jagan) తన కుటుంబసభ్యుడైన వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ని చైర్మన్ గా కొనసాగించారు. కానీ, ఈసారి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy)ని ఆ పదవి వరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. 2006-2008 మధ్య సేవలందించారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్ గా కొనసాగుతున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా భూమనకి పేరుంది.
అయితే.. భూమన చుట్టూ క్రైస్తవం వివాదం ఉంది. గతంలో ఈయన కుమార్తె వివాహాన్ని ఎంతో ఘనంగా చేశారు. కానీ, ఇది క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. ప్రస్తుత సీఎం జగన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ గా భూమన ఉన్న సమయంలో తొలివెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని అప్పట్లో బాగా హైలైట్ చేసింది. అలాగే, బీజేపీ, హిందూ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అదే సమయంలో ఈనాడులో వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వార్త ఒకటి వైరల్ అయింది. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమనను నియమించడంపై స్పందిస్తూ.. వేంకటేశ్వర స్వామిని ఆయన అవహేళన చేశాడని బైరెడ్డి మండిపడ్డారు. ‘‘అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమౌతుంది’’ అని భూమన అన్నాడని.. అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి అదే పదవికి కరుణాకర్ రెడ్డిని నియమించడంతో ఆయన కుమార్తె వివాహం, బైరెడ్డి వ్యాఖ్యల వార్తల క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.
మరో రెండు రోజుల్లో టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగుస్తుంది. దీంతో వైవీ సుబ్బారెడ్డి మాజీ అవుతారు. ఈయనపైన కూడా క్రైస్తవం ఆరోపణలు ఉన్నాయి. ఓసారి వైఎస్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనగా.. అక్కడ క్రిస్టియన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇది అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. పవిత్రమైన తిరుమల క్షేత్రానికి సంబంధించిన పోస్ట్ లో ఉండి ఇలా చేయడం ఏంటని ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు ప్రశ్నించాయి.