తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) రోజూ వేలాది మంది భక్తులు వెళ్లి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. ప్రత్యేక రోజుల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. అదే వైకుంఠ ద్వార దర్శనం అయితే.. తిరుమల గిరులు అన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఏడు కొండలు గోవందనామస్మరణతో మార్మోగుతాయి. టీటీడీ ఈరోజు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్(Online Tickets)లో పెట్టింది.
టీటీడీ డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే నిమిషాల వ్యవధిలోనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టీటీడీ శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టింది.
ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తించనుండగా రోజుకి 22,500 టికెట్ల చొప్పున మొత్తం 2.25 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల చేసిన 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్లు విక్రయాలు పూర్తయ్యాయి.
16 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. 17 నిమిషాల నిముషాల వ్యవధిలోనే 90 శాతం టికెట్ల విక్రయాలు పూర్తి పూర్తయ్యాయి. మొత్తంగా 21 నిమిషాల వ్యవధిలో పూర్తిస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.