విపక్షాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. దేశాన్ని, సనాతన ధర్మాన్ని (Sanatana Darma) అగౌరవపరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తుక్డే-తుక్డే మైండ్ సెట్‌ను విపక్షాలు ప్రోత్సహిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయంటూ ఆరోపించారు.
ప్రధాని మోడీ వసుదైక కుటుంబం అనే భావనను వ్యాపింపజేస్తున్నారని అన్నారు. ‘సబ్ కా సాథ్… సబ్ కా వికాస్’అనే నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కానీ విపక్షాలు మాత్రం తప్పుడు భాషను ఉపయోగిస్తోందన్నారు. మూడు రాష్ట్రాల్లో ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ నిందిస్తోందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానపరిచేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి గురించి కాంగ్రెస్ విశ్లేషణ చేయకుండా దేశ సంస్కృతిని, సంప్రదాయాలను అవమానిస్తోందంటూ నిప్పులు చెరిగారు.
ఉత్తరాది గురించి అభ్యంతరకర కామెంట్లు చేస్తోందన్నారు. అలాంటి ఘటనలతో సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని విమర్శించారు. దేశంలో సమైక్యతకు భంగం కలిగించేందకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. అమేథీలో ఓటమితో ఈ కుట్ర ప్రారంభమైందని ఆరోపించారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ వయనాడ్‌లో చేసిన ప్రకటన ఉత్తర భారతీయులను కించపరిచేలా కనిపించిందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా, దేశాన్ని విభజించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని వారు అనుకుంటున్నారన్నారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పాలించాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.