తప్పులెన్నువారు తండోపతండంబు.. లుర్వి జనుల కెల్లా నుండు దప్పు.. తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు.. విశ్వదాభిరామ వినుర వేమ.. ఈ పద్యం నేటి రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.. ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరనే భావం సరిగ్గా బీఆర్ఎస్ నేతలకు సూట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
పదేళ్ళలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. అందినకాడికి దండుకొన్నారని.. త్వరలో ఆధారాలతో బయట పెడతామని కాంగ్రెస్ (Congress) నేతలు ఒకవైపు చెబుతుండగా.. గులాబీ చిన్న బాస్ మాత్రం అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం అసహనానికి గురిచేస్తోందని చెవులు కోరుక్కోవడం వినిపిస్తోంది. కాగా అనుచితంగా కేటీఆర్ (KTR) ఆరోపణలు చేయడంపై కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మండిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..
ఇవేవీ పట్టించుకోని కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ఘట్కేసర్ (Ghatkesar)లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సభలో మాట్లాడిన ఆయన.. హామీలు అమలు చేయలేక సీఎం చేతులెత్తేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు కడుపుమండి ఆటోలు తగల బెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీ (KRM)కి అప్పగించడం దారుణమని విమర్శించారు..
కాంగ్రెస్ మన ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందన్న కేటీఆర్.. జాతీయ పార్టీలను నిలదీయాలంటే బీఆర్ఎస్ ఉండాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని పేర్కొన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. రెండు నెలలు గడుస్తున్నా.. రైతుల రుణమాఫీ జరగలేదని తెలిపిన కేటీఆర్.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడం బాధాకరం అని వెల్లడించారు..