ఏపీ(AP)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) దగ్గరపడుతుండడంతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. జగన్ తాజా రాజకీయ నిర్ణయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arunkumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని చెప్పిన ఆయన ఏపీ అసెంబ్లీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు.
ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లే అని అభిప్రాయపడ్డారు. త్యాగాలు చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారు చెప్పారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని అలాంటి అనుభవం సీఎం జగన్కు లేదన్నారు.
టికెట్లు మార్చకపోతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని ఇక్కడ జగన్ టికెట్లు మారుస్తే గెలుస్తారని అనుకోవడం సరికాదన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని, అంతా వలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఆరోపించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచి సీఎం జగన్ గొప్ప ప్రయోగం చేశారని ఎద్దేవా చేశారు. జవహర్ లాల్ నెహ్రూ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమితమైన అభిమానమని, అలాంటిది నెహ్రూపై ఎంపీ విజయసాయి పార్లమెంట్లో తప్పుపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో హిందుత్వం తగ్గుతుందని అనడం వాస్తవం కాదని ఉండవల్లి అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీపై ఉండవల్లి మాట్లాడుతూ.. జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం కచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందని అన్నారు.
లోక్ సభలో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సరియైన పద్ధతి కాదని ఉండవల్లి అన్నారు. పార్లమెంట్ లో ప్రవేశించిన దుండగుడికి ఆ పాసులు ఇచ్చిన ఎంపీని ఇప్పటిదాకా విచారించలేదు. ఇంత మందిని సస్పెండ్ చేయడం తానెప్పుడూ చూడలేదని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి ఏపీలో లేదని ఉండవల్లి అన్నారు.