హైదరాబాద్ (Hyderabad), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (Ind Vs Eng) మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకొంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను కలిసేందుకు ఒక అభిమాని భద్రతా చర్యలను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. దీంతో ఊహించని పరిణామంతో షాకైన రోహిత్.. అభిమానిని వారించారు.
ఇంతలో అక్కడికి చేరుకొన్న భద్రతా సిబ్బంది ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఈ సమస్య ఇంతటితో అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ అభిమానికి షాకిచ్చారు అధికారులు.. అతను బారికేడ్స్ దాటి మైదానంలోకి దూసుకు రావడాన్ని రాచకొండ పోలీసులు సీరియస్గా తీసుకొన్నారు.
ఉప్పల్ (Uppal) పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించాడు. ఈ ఘటన నేపథ్యంలో ఉప్పల్ మైదానంలో సెక్యూరిటీ పెంచారు. ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని సూచించారు.. నిబంధలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు మైదానంలోకి ప్రవేశించిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా పోలీసులు తెలిపారు..