అమెరికా (USA)లో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన వెలుగుచూసింది. ఓ నల్లజాతీయుడిని కింద పడేసి, మెడపై మోకాలితో అదిమిపట్టి కర్కశంగా వ్యవహరించారు. దీంతో ఆ వ్యక్తి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడీయోను ఒహైయో పోలీసులు వెలుగులోకి తీసుకురాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హిట్ అండ్ రన్ కేసులో ఫ్రాంక్ టైసన్(53) అనే వ్యక్తిని పోలీసులు అనుమానితుడి లిస్టులో చేర్చారు. కారు ప్రమాదానికి(Car Accident)కారణమైన ఆ వ్యక్తి ఒక బార్(Bar)లోకి పారిపోయాడని పెట్రోలింగ్ పోలీసులు అతన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆ ఫ్రాంక్ టైసన్‌కు, పోలీసుల మధ్య కొద్ది సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.
పోలీసులు అతడి మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. అతడి చేతులకు బలవంతంగా బేడీలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి ఏకంగా ఫ్రాంక్ టైసన్ మెడపై కాలుపెట్టి అదిమిపట్టాడు. ఫ్రాంక్ ఊపిరాడటంలేదంటూ ఎంత అరిచినా వినిపించుకోలేదు. అరవొద్దు అంటూ ఆ పోలీసు అలాగే కాలుపెట్టడంతో కొద్దిసేపటికి టైసన్‌లో ఎలాంటి చలనం లేదు.
దీంతో పోలీసులు అతడి చేతులకు వేసిన బేడీలను తీసి సీపీఆర్ చేశారు. అయినప్పటికీ అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. దీంతో అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్రాంక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు. అదేవిధంగా ఫ్రాంక్ మృతికి కారణమైన పోలీసు అధికారులను సెలవులపై పంపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.