ఎన్నికలు వచ్చాయంటే కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని చిత్రాతి చిత్రంగా నిర్వహించడం కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకొంది. అలీగఢ్ (Aligarh), లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పండిట్ కేశవ్ దేవ్ విన్నూతనంగా ప్రచారం చేయాలని భావించి.. భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ గుర్తు చెప్పుల జతతో రంగంలోకి దిగారు..
ఇతను ఏడు చెప్పులు కలిసున్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో కనిపించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో.. పండిట్ కేశవ్ దేవ్ చెప్పుల దండ, తెల్లటి తలపాగా ధరించి కొంతమంది మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. అలాగే ఈయన మద్దతుదారుల్లో ఒకరు అభ్యర్థి చిత్రం, స్లిప్పర్ పోల్ గుర్తుతో కూడిన సమర్థిత్ భ్రష్టాచార వ్యతిరేక సేన (అవినీతి నిరోధక సైన్యం) అనే బ్యానర్ ను పట్టుకొని కనిపించారు.
మరొకతను భ్రష్టాచర్ కా వినాష్ (అవినీతిని నాశనం చేయడం) లక్ష్యంగా రాబోయే జాతీయ ఎన్నికలకు మద్దతు కోరుతూ వీధుల్లోని ఆహార విక్రేతలు, దుకాణదారులు, పౌరుల వద్దకు వెళ్ళడం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా బీజేపీ (BJP) అభ్యర్థి సతీష్ కుమార్ గౌతమ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 6,56,215 ఓట్లతో అలీగఢ్ స్థానంలో గెలుపొందారు. ఇతను బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అజిత్ బలియన్‌పై 4,26,954 ఓట్లతో విజయం సాధించారు.
మరోవైపు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి బిజేంద్ర సింగ్ 50,880 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సతీష్ గౌతమ్ మొత్తం 48 శాతం ఓట్లను పొంది ఈ స్థానాన్ని తొలిసారిగా కైవసం చేసుకొన్నారు.. ఇక ఎన్నికల ప్రచారాలు వింతగా నిర్వహించడం కొత్తేమీ కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.. ఇలా చేయడం వల్ల సోషల్ మీడియాలో త్వరగా వైరల్ గా మారడం కనిపిస్తోంది..