ఉత్తరాఖండ్ సొరంగం(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్కూ ఆపరేషన్ జోరుగా సాగుతోంది. ఉత్తర్‌కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంతభాగం ఆదివారం కూలిపోయింది. సుమారు 200 మీటర్ల మేర ఆ శిథిలాలు ఉన్నాయి. దీంతో గత 48 గంటల నుంచి కార్మికులు ఆ టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.
ప్రస్తుతం చిక్కుకున్న కార్మికులు బఫర్ జోన్‌లో ఉన్నారని, ఆహారాన్ని, ఆక్సిజన్‌ను అందిస్తున్నారని, వాళ్లు నడిచేందుకు, శ్వాస పీల్చేందుకు 400 మీటర్ల ఏరియా ఉందన్నారు. వాకీటాకీల ద్వారా మాట్లాడుతున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. కార్మికుల్లో బీహార్, జార్ఖండ్, యూపీ, బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ శరణార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
కార్మికుల వద్దకు చేరుకునేందుకు ఎస్కేప్ మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. సుమారు 40 మీటర్ల దూరంలో ఆ చిక్కుకున్న కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. టన్నెల్‌కు అడ్డంగా ఉన్న 21 మీటర్ల శ్లాబ్‌ను తొలగించారు. ఇంకా 19 మీటర్ల మార్గాన్ని క్లియర్ చేయాల్సి ఉంది. కార్మికులకు ఆహార పానీయాలు అందించామని పోలీసులు తెలిపారు.
శిథిలాల వద్ద బోరు ద్వారా ఓ రంధ్రాన్ని వేసి, ఆ పైప్‌ల ద్వారా చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొరంగం లోపల ఊడిపడుతున్న పెచ్చులను ఆపడానికి కాంక్రీట్ స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 900 ఎంఎం వెడల్పు ఉన్న పైప్‌లను సొరంగంలోకి పంపేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.