మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు కాంగ్రెస్ ప్రారంభించింది. నేతల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V. Hanumantha Rao), ఖమ్మం (Khammam) ఎంపీ టికెట్ కొరకు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ (BJP)పై మండిపడ్డారు..
తెలంగాణ (Telangana)లో అత్యంత ప్రతిష్టాత్మక జాతర అయిన మేడారం బెల్లం పంపిణీని రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికిన వి.హనుమంతరావు.. బీజేపీ నాయకులు మత రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు.. భక్తి భావనతోనే మేడారం బెల్లం పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానుకోవాలని సూచించారు. కేంద్రంలో పదేళ్లు పాలించే అవకాశాన్ని ఇచ్చినా.. మత రాజకీయాలు చేయడం మానలేదని అన్నారు.
కులాలు, మతాల పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారని ప్రశ్నించిన వీహెచ్.. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి చేదు అనుభవం తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒకటి, రెండు సీట్లకు పరిమితం అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అడవుల్లో వేయవద్దని, పరిశుభ్రత పాటించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు..